Friday, February 8, 2013

3005 - ఆధార్‌ కార్డు కోసం జనం అష్టకష్టాలు



  • గ్యాస్‌ లింకుతో ఉరుకులు, పరుగులు
  • ఐరిష్ కేంద్రాల వద్ద జనం బారులు        
ఆధార్‌కార్డు.. ఇప్పుడెవరిని కదిలించినా ఇదే సమస్య. ఏ నోట విన్నా ఆధార్‌ కష్టాలే. చిన్న కార్డు ముక్క కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోందని జనం ఊసూరుమంటున్నారు. కొందరైతే, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆధార్‌ కేంద్రాలకు చేరుకుందామా అన్నట్లే ఉన్నారు. ఆధార్‌ లింకు డేటు పెంచినా, జనం మాత్రం ఐరిస్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.ఆధార్‌ కార్డు లేకుంటే సబ్సిడీ గ్యాస్‌ కట్‌. ఆధార్‌ లేకుంటే నగదు బదిలీ కాదు. ఇలా ఏ అవసరానికైనా ఆధారే ఆధారం. కేంద్రం విధించిన షరతుతో రాష్ట్రంలో అలజడి చోటు చేసుకుంది. ఆధార్‌ కార్డు కోసం జనం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఈనెల 15తో ఈ నిబంధన అమలులోకి వస్తుందనడంతో ఐరిష్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

 ఒక్కసారిగా జనం ఎగబడటంతో చాలాచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు.ఆధార్‌కార్డు తీసుకోండని అధికారులు చెవుల్లో మైకులు పెట్టి చెప్పినా పట్టించుకోని జనం, ఒక్క నిబంధనతో నిద్రలేచారు. కార్డు కోసం అష్టకష్టాలు పడుతున్నారు.సొంత పనులు మానుకొని ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొంతమంది ఇంతకుముందే వివరాలు నమోదు చేసుకున్నా, కార్డు రాకపోవడంతో మళ్లీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.ఇక సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడంలో దేశంలోనే ముందున్న తూర్పుగోదావరి జిల్లాలో కార్డులు అందించడంలో మాత్రం వెనుకంజలో ఉంది. ఇప్పటికీ జిల్లాలో చాలాచోట్ల బయోమెట్రిక్ విధానం ద్వారా రేషన్ సరుకులు అందిస్తున్నారు.

 ఆధార్ కార్డులు లేనివారికి రేషన్‌ కూడా కట్ చేస్తున్నారు. దీంతో జనం ఐరిష్‌ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.జిల్లాలో 30శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఎప్పుడు పనిచేస్తాయో అక్కడున్న సిబ్బందికి కూడా తెలియని పరిస్థితి. దీంతో జిల్లా నలుమూలల నుంచి జనం కాకినాడ కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు.అటు మెదక్‌ జిల్లా సిద్దిపేటలో ఆధార్‌ కేంద్రాన్ని మూసేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వివరాల నమోదు ఫామ్స్‌, కార్డులు లేవనే సాకుతో ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అర్ధాంతరంగా మూసేశారు. సంక్షేమ పథకాలతో లింకు పెడుతున్న అధికారులు ఆధార్‌ కార్డుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.