Monday, July 29, 2013

4434 - స్కాలర్‌షిప్‌కూ అదే ‘ఆధార్’!







ఇంకా ఆధార్ కార్డు రాని విద్యార్థులు స్కాలర్‌షిప్ పొందాలంటే ఇక వెనుక వరుసలో నిలబడాల్సిందే.
7/19/2013 3:40:00 AM

- ఆధార్‌తో దరఖాస్తు చేసిన విద్యార్థులకే తొలి ప్రాధాన్యం
- ‘నగదు బదిలీ’కి ఎంపికైన 13 జిల్లాల్లో ఆధార్ తప్పనిసరి
- ఆయా కళాశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటు 


సాక్షి, హైదరాబాద్: ఇంకా ఆధార్ కార్డు రాని విద్యార్థులు స్కాలర్‌షిప్ పొందాలంటే ఇక వెనుక వరుసలో నిలబడాల్సిందే. ఆధార్ కార్డును దరఖాస్తుతో జత చేసినవారికే మంజూరులో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారి తర్వాతే ఆధార్ లేని విద్యార్థులకు ఇవ్వాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ప్రాథమికంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని స్కాలర్‌షిప్‌లకు వర్తింపజేసే అంశంపై గురువారం సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, ఇతర సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, లీడ్ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నగదు బదిలీ కింద రెండు దశల్లో ఎంపిక చేసిన 13 జిల్లాల్లోని విద్యార్థులకు ఆధార్ పేమెంట్ బ్రిడ్జి ద్వారా ఈ ఏడాది నుంచి స్కాలర్‌షిప్ ఇచ్చే విషయమై ఈ సమావేశంలో చర్చ జరిగింది. నగదు బదిలీకి ఆధార్ తప్పనిసరి అయినందున ఆధార్ ఉన్న విద్యార్థులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే ఆయా విద్యార్థులకు ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్ జమ చేయాలని, ఆధార్ లేనివారికి మూడు నెలలకోసారి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. అందుకు వారు కూడా సమ్మతించినట్లు తెలిసింది. ఇక ఆ 13 జిల్లాల్లో ఆధార్ నమోదు వివరాలను పరిశీలించి, కళాశాలల స్థాయిలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

కేంద్రం నిధుల బదిలీపై తర్జనభర్జన..
కేంద్ర ప్రభుత్వం ‘నగదు బదిలీ’ పథకం కింద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు నిధులు ఇవ్వనుంది. ఆ నిధులను విద్యార్థులకు ఎలా బదిలీ చేయాలన్న విషయమై సంక్షేమ శాఖల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మొత్తంగాను, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కొంతమేర కేంద్రం సాయం చేయనుంది. అయితే ఈ మొత్తం కలిపి దాదాపు రూ. వెయ్యి కోట్లు నేరుగా విద్యార్థుల ఖాతాలకే బదిలీ చేస్తామని, వారి వివరాలు పంపాలని కేంద్రం కోరుతోంది. రాష్ట్ర అధికారులు మాత్రం అది సమంజసం కాదని అంటున్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లో బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు కేంద్రం చేసే సాయం గోరంతేనని, దీనికోసం ఎంతమంది విద్యార్థుల వివరాలు పంపాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు సరిపడా లబ్ధిదారుల ఎంపిక ఎలా చేయాలన్న దానిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎప్పటిలాగే ఆ నిధులన్నీ తమకే ఇస్తే తామే విద్యార్థులకు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. కేంద్రం దీనికి అంగీకరించట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలో స్కాలర్‌షిప్ బదిలీ ఎలా చేయాలన్న విషయంలో ఇంతవరకు ఒక స్పష్టత రాలే